ఓ ఆదామా! నీవు ఎక్కడ ?

దేవుని వ్యక్తిత్వము మరియు ఆయన స్వభావమును గురించి బైబిల్ మరియు ఖురాన్‍లలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి?

బైబిల్‍లోని దేవుడు మనుష్యుల "దగ్గరకు వస్తాడు", పరలోకము విడిచి మన కొరకు "క్రిందకు వస్తాడు" మరియు మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. బైబిలంతా కూడా "దేవుడు మనిషికై చేసిన అన్వేషణ" యొక్క కథ.

బైబిల్‍లోని మొదటి అధ్యాయములలో మానవుని యొక్క సృష్టి మరియు అతడి పతనాన్ని గురించిన విషయాలను మనము చదువుతాము. అక్కడ మొదటి పాపము/ఆజ్ఞ ఉల్లంఘనము చేసిన తరువాత ఆదాము మరియు హవ్వ తమ మనస్సాక్షి చేత నిందించబడినవారై  దేవుని నుండి దాగుకొనడానికి ప్రయత్నించారు. అప్పుడు దేవుడు ఏదెను తోటలో ఆదాము వద్దకు వచ్చి "నీవు ఎక్కడ ఉన్నావు?" అని పిలిచాడు. (ఆదికాండము 3:9)

మనుష్యుడు దేవుని సముఖము నుండి పారిపోయాడు, ఎందుకంటే అతను దేవుని ఎదుట అపరాధి అని అతనికి తెలిసిపోయింది కాబట్టి. అయినప్పటికి దేవుడే దిగివచ్చి మనలను వెతికి మనతో కూడా ఆ పరస్పరమైన ప్రేమ సంబంధాన్ని తిరిగి స్థాపించాలని కోరాడు. దానికై అవసరమైన అన్ని పనులు దేవుడే స్వయంగా చేశాడు. ఇదే బైబిల్‍లోని మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఉన్న కథ. మరియు చివరి పుస్తకంలో మనము క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని గూర్చి చదువుతాము:

"అప్పుడు - ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును." (ప్రకటన 21:3)

దేవుని యొక్క కోరిక తుదకు నెరవేరింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యయము పూర్తిగా చదవండి, ఇది ఒక అద్భుతమైన అధ్యాయము.

నిజానికి మనదేవుడు మనలను వెతికే దేవుడై ఉన్నాడు, మనదగ్గర ఉండాలని ఆయన పైనుండి కిందకు దిగివస్తాడు. ఆయన తన వ్యక్తిత్వాన్ని, తన హృదయాన్ని, మరియు తన సృష్టితో ఒక ప్రేమపూర్వకమైన సంబంధాన్ని స్థాపించాలనే తన చిత్తాని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథం 21:3 లో చెప్పబడ్డ తన ప్రజలలో మీరు కూడా ఉంటారా? ఇదే బైబిల్‍లోని ముఖ్య విషయము. ఈ బైబిల్ గ్రంథం మనకు దేవుడిని బయలుపరుస్తుంది, మనము దేవుని మాట విని ఆయన ప్రజలముగా మారులాగున మనకు దేవుడిని బయలుపరుస్తుంది.

దీనికి విరుద్ధంగా ఖురాన్, దేవుడు మనుష్యులతో కలవకుండా దూరంగా ఉంటాడని, ఆయనను మనుష్యులు అర్థం చేసుకోలేని వాడిగా ఉంటాడని వర్ణిస్తుంది. ఒక ముస్లిం పండితుడు ఈ విధంగా తెలియచేశాడు, "దేవుడు కేవలం ఆయన చిత్తాన్ని మాత్రమే బయలుపరుస్తాడు కాని తనను తానూ ఎప్పుడు బయలుపరుచకొనడు. ఆయన ఎప్పటికీ మరుగై ఉంటాడు". ఆయన మన మెడలోని పెద్ద నెత్తుటి నాళముకన్నా మనకు దగ్గరగా ఉన్నాడని ఖురాన్ సెలవిస్తున్నది, కాని ఇది కేవలం "పారిభాషికమైన సామీప్యమే" గాని మరొకటికాదు. ఎందుకంటే మన మెడలో ఒక పెద్ద నెత్తుటి నాళము ఉన్నదని మనకు తెలిసినా దానితో మనము ఎలాంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగియుండము, అది కూడా మనతో ఎలాంటి వ్యకిగతమైన సంబంధాన్ని ఎన్నడూ కలిగియుండదు కదా! అదే విధంగా దేవుడు కూడా "అన్ని చోట్లలో" ఉంటాడు (దూరముగాను మరియు  దగ్గరగా) అని ఎవరైనా అంటే - ఏ విధంగానైతే గాలి మన చుట్టూ ఉంటుందో అదే విధంగా దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు అని మాత్రమే అర్థం. ఐతే బైబిల్‍లోని దేవుడు, తాను సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడు అయిన కారణంగా మనతో ఉన్నానని చెప్పటంలేదు, ఎందుకంటే, ఆయన దేవుడు కాబట్టి మనం అవునన్నా కాదన్నా ఎలాగైనా ఆయన అన్ని చోట్ల ఉంటాడు.

అలాకాదు, దగ్గరగా ఉన్నానని చెప్పుకుంటూ మనకు దూరంగా ఉండాలని ఆయన  కోరుకోవటం లేదుగాని ఆయన మనకు నిజంగానే దగ్గరగా ఉండాలని కోరుకొంటున్నాడు. మనచే ప్రేమింపబడే వ్యక్తిలా మనతోనే ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాడు.

మానవుడు దేవుని చిత్తాన్ని శిరసావహిస్తూ ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడమే ఇస్లాం, కాని బైబిల్‍లోని దేవుడు మాత్రం ఆయనే మొదటి అడుగు వేసి మనలను వెతికి రక్షించడానికి కిందకు దిగి వచ్చాడు. ఈ గమనము ఖుర్‍ఆన్‍లోని అల్లాహ్‍ యొక్క గమనానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నది.
 
ఆంగ్ల మూలం - Adam, where are you?


దేవుడు ఎవరు?
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు