సహో.సుధీర్ ఈ క్రింది విధంగా వ్రాశారు
ప్రియమైన ఆన్సరింగ్ ఇస్లాం వెబ్‍సైటు వారికి, ఈ మధ్యన నేను హెబ్రీ 4:15 మీద ఒకరు ఈ విధంగా చెప్పుట విన్నాను.
"మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను". కాబట్టి యేసు క్రీస్తు కూడా మనవలెనే అన్ని విషయాలలో శోధింపబడెను కదా? అంటే మనవలెనే ఆయన కూడా తన తలంపులలో ఒక అమ్మాయిని మానభంగం చేసినట్లుగానో, లేక ఎవరినైనా హత్య చేసినట్లుగానో తలంపులు తలచి ఉండాలి కదా? కాని యాకోబు 1:13లో "దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు" అని ఉంది కదా? అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసు క్రీస్తు శోధింపబడుట చూస్తాము. కాబట్టి యేసు క్రీస్తు దేవుడయ్యే ఆస్కారమే లేదు - అని వారంటున్నారు. ప్రియ సహోదరుడా నేను దీనిని అర్థం చేసికొనలేక దిగ్భ్రమములో ఉన్నాను. దయచేసి నాకు దీని జవాబు తెలుపగలరు.
మా జవాబు :
మానవ రూపములో ఉండగా యేసు క్రీస్తు ప్రభువు సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడ్డారు. ఆ మాటాలో ఏ సంశయము లేదు కాని ఆయన పాపము లేనివారిగా ఉంటిరి. అనగా, ఆయన అన్ని రకములైన పాపములు చేయుటకై శోధించబడ్డారని దీని అర్థము కాదు కాని ఆయన సమస్త విషయములలో అన్ని విధాలా పరీక్షింపబడి ఋజువు చేయబడితిరి. నిజానికి ఇక్కడ గ్రీకు భాషలో "పిరజో" అనే పదం వాడబడింది. ఆ పదమునకు పలు అర్థములున్నాయి, మొదటి అర్థము - పరీక్ష చేయుట, ఆ తరువాతి అర్థములేవనగా - ప్రయత్నము చేయుట, పరికించుట, క్రమశిక్షణకు గురియగుట అనే అర్థములు ఉన్నాయి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు శోధింపబడ్డారు అంటే ఆయన పరిక్ష చేయబడ్డారు, లేక పలుమార్లు సాతాను ఆయనను శోధించాలని విఫల ప్రయత్నములు ఎన్నో చేశాడు, ఆయన అన్ని విషయములలో పరికించబడ్డారు లేక పరిశీలించబడ్డారు, లేక దేవుని క్రమశిక్షణలో నెగ్గారు అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఎవరో కొందరు అవిశ్వాసులు తమ తెలివి తక్కువతనముతో చేసే అబద్ధ ప్రేలాపనలను విని కంపించవలసిన అవసరం మనకు ఏమత్రం లేదు.
ఇంకా బైబిల్ ఏమి చెప్తోంది?
1) ఆయన దేవుడు, మరియు దేవుడు కీడు లేక చెడు విషయమై శోధింపబడనేరడు (యాకోబు 1:13) కాబట్టి ఆయన పైన ఉదహరింపబడిన పాపముల వంటివి ఏవీ చేయలేదని తెలిసిపోతున్నది.
2) ఆయన అద్భుతముగా కన్యకకు పుట్టారు కాబట్టి, మానవులందరిలో ఉంటూ వారందరినీ సమానముగా పాపానికి ప్రేరేపించే "జన్మ పాపం" ఆయనలో లేదు. అందుచేత ఆయనలో ఎన్నడూ ఏ పాపము లేదు (1 యోహాను 3:5) కాబట్టి ఆయన పైన ఉదహరింపబడిన పాపముల వంటివి ఏవీ చేయలేదని తెలిసిపోతున్నది.
3) యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; ఆవును యుగయుగములకు ఒక్కటేరీతిగా ఉండును (హెబ్రీ 13:8). అంటే ఆయన మానవ రూపంలో ఉండినా కూడ తన దైవత్వాన్ని కోల్పోయిన సందర్భము ఎన్నడూ లేదు. కాబట్టి ఆయన మానవ ఆకారములో ఉన్నాకాని తన దైవత్వాన్ని కూడా తనతో కలిగి ఉండేవారు. అందువలననే దైవమయిన ఆయన పైన ఉదహరింపబడిన పాపముల వంటివి ఏవీ చేయలేదని తెలిసిపోతున్నది.
4) ఇతర మనుష్యులకు అవసరమైనట్టు ఆయనకు మారుమనస్సు పొందవలసిన అవసరం లేదు. అందుకనే ఆయన నీకొదేముతో మాట్లాడుతూ మీరు క్రొత్తగా జన్మింపవలెను అని అన్నారే కాని మనం క్రొత్తగా జన్మించాలని తనని కూడా కలుపుకొని ఎన్నడూ మాట్లాడలేదు. కాబట్టి ఆయన పైన ఉదహరింపబడిన పాపముల వంటివి ఏవీ చేయలేదని తెలిసిపోతున్నది.
5) బైబిల్లో ఎక్కడైనా యేసు క్రీస్తు ప్రభువు శోధనలో ఓడిపోయారనో లేక పడిపోయారనో చదువుతామా? ఆయన అందరికంటే అతి పెద్ద శోధకుడైన సాతానునే జయించేశారు. అలాంటప్పుడు ఆయన శోధనలో పాపం చేశారనటం కేవలం పెను గుడ్డితనం మరియు భ్రమపరచు సాతాను కలిగించే గొప్ప భ్రమ. ఆయన శోధనకు గురైనా కూడా ప్రతి శోధనను జయించారేగాని ఎన్నడూ తన దైవత్వానికి విరుద్ధంగా శోధనలో ఓడిపోయి లేక పడిపోయి పాపం చేయలేదు.
అసలు ఇవన్నీ ఎందుకు? హెబ్రీ 4:15 వచనాన్ని చివరి వరకు చదవండి. అక్కడేమున్నది? మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని ఉంది. ఒకవేళ ఆయన కనుక పైన ఉదహరించబడిన పాపములు చేసినచో ఆయన పాపము లేనివాడు అని బైబిల్ చెప్పలేదు కదా? కాబట్టి ఆయన ప్రతి విషయములో శోధించబడిననూ పాపము లేనివారుగా ఉన్నారంటే అదొక పెద్ద అద్భుతం. ఆయన నిజంగా దేవుడనటానికి అదే అతి పెద్ద ఋజువు. ఇంతకు మించి ఇంకే ఋజువు కావాలి? ముహమ్మదు సహా ఇలాంటి అద్భుత జీవితాన్ని ఎవరూ జీవించి చూపలేకపోయారు.
నిజానికి తండ్రియైన దేవుడసలు ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన, అనగా యేసు క్రీస్తు ప్రభువు ఎన్నడూ పాపం చెయలేరని తనకీ మరియు తన తండ్రికి మాత్రమే తెలుసు. కానీ దేవ దూతలకు మరియు మనుష్యులకు తెలియదు కాబట్టి, వారి యెదుట ప్రదర్శించి ఋజువు చేయటానికే దేవుడా అద్భుతం చేశాడు. నిజంగా అది ఒక మహాద్భుతం, ఏ మానవుడూ అలా ఎన్నడూ చేయలేడు.
ఇది ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు విభాగం వారి సౌజన్యం.