పాప క్షమాపణ

    నిజమైన తృప్తి : నిజముగా సంతోషముగా నుండు వ్యక్తి ఎవరు? సంతోషముగా నుండునది ధనము కలిగినవాడా, లేక గొప్ప అంతస్తులోనున్నవాడా లేక అధికారము గలిగినవాడా? మనుష్యులు వీటిలో ఏదో ఒకటి లేక అనేకములు సంపాదింపవలయునని చాలా కష్టపడుదురు. కాని చాలా సంవత్సరముల  తరువాత వారు పొందవలెనని ప్రయత్నించుచున్ను సంతోషమును, సంతృప్తిని కనుగొనలేకపోవుచున్నారు. దీని నుండి మనకు నిజమైన సంతోషము, సంతృప్తినిచ్చునవి ఇవి కావని పాఠము నేర్చుకొనవలయును కదా?

    దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా నుండినను, జయశాలియు బలవంతుడునుయైన ఒక రాజు ధన్యుడని అయన చెప్పలేదు. ఎవని(అతిక్రమములు) పాపములు క్షమింపబడెనో వాడే ధన్యుడు అని చెప్పెను. ఒకడు మరణశిక్ష విధింపబడి ఉరితీయబడుటకు తీసికొని పోబడుచున్నాడనుకొనుము. ఒక స్నేహితుడు, దారిలొ అతనిని కలసుకొని "నా ప్రియమైన  స్నేహితుడా, ఈ పదివేల రూపాయలు నీకు బహుమానముగా నివ్వదలచినాను" అని చెప్పిన యెడల దానిని పుచ్చుకొనుటలో అతనికి సంతోషముండునా? దీని వలన నాకేమి ప్రయొజనము, నేనిక కొన్ని నిమిషములైన తరువాత చనిపొదును అని అనును. ఆ తరువాత భారతదేశము యొక్క అధ్యక్షుని యొద్దనుండి ఒక ఉత్తరము తీసికొని ఒకడు వచ్చెననుకొనుము. అది క్షమాపణ పత్రము. దానిని తీసికొనుటకు అతడెంత సంతోషించునో గదా! దేవుడు మన పాపములను క్షమించెనని మనమెరిగినప్పుడు కలుగు సంతోషము లోకములో అన్నిటికంటెను అత్యధికమైనదిగా నుండును.

    పశ్చత్తాపము: మంచి రాజును గురించిన కథ ఒకటున్నది. ఆయన ఒక చెరసాలను దర్శించబోయినప్పుడు పదిమంది ఖైదీలు ఆయన ముందుకు తేబడిరి. రాజు మొదటి వానితో నీవు ఎట్లు చెరసాలకు వచ్చితివని అడిగెను. అప్పుడా ఖైదీ రాజు హృదయమును కరిగించినట్లయిన తనను చెరసాలలో నుండి విడిపించునేమోయని తలంచి "నేను నిరుపరాధిని, నా మీద అన్యాయముగా నిందమోపిరని" చెప్పుచూ తన విషాదకరమైన కథ చెప్పెను. రాజు తన్ను ఎట్లయినను విడిపించునని ఎంతో ఆశతో కనిపెట్టెను. రాజు ఆ విధముగా ఒకరి తరువాత ఒకరిని అడిగినపుడు అందురు మొదటివాని పద్దతినే అవలంబించి తమ తప్పిదములను కప్పిపుచ్చిరి. కడకు పదియవ ఖైదీ యొద్దకు వచ్చెను. అతడు ఎంతో ఏడ్చుచూ, శోధనకు లొంగిపొయి పెద్ద దొంగతనము చేసితినని ఒప్పుకొనెను. అందరు అశ్చర్యముతో చూచుచుండగా రాజు ఆ పదియవ దొంగను క్షమించి ఇతనిని విడుదల చేయవలెనని చెప్పెను. ఆ విధముగా చేయుటలో రాజు న్యాయవంతుడని తేటగా స్పష్టమగుచున్నది. బైబిలు ఈలాగు చెప్పుచున్నది. "అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13). నిజమైన పశ్చాత్తాపముతో మన పాపములను ఒప్పుకొనినప్పుడే, దేవుని యొద్దనుండి మనము కనికరము, క్షమాపణ పొందగలము.

    క్షమాపణ విలువ: ప్రతి పాపమునకు శిక్ష విధింపబడవలయునని దేవుని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. దేవుడు తన ధర్మశాస్త్రమును కొట్టివేసి పాపిని క్షమించగలడా? అట్లు చేయలేడు. కాని ఆయనొక్కడే ఏమిచేయగలడో దానిని చేసెను. మన పాపము యొక్క శిక్షను తన మీదనే వేసికొనెను. దేవుడే క్రీస్తులో ఉండి, మానవ రూపములో బయలు పరచుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నియు భరించి సిలువపై మరణించెను. "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది" (యెషయా 53:5). ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి "ఇది నా రక్తము, అనగా పాపక్షమాణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము" (మత్తయి 26:28) అని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు మానవులందరి పాపముల కొరకు మరణించెను. అందువలన ఆయనొక్కడే పాపములను క్షమించు శక్తిగలవాడు. "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును"(1 యోహాను 1:9).

    హెచ్చరిక: ఒకడు బుద్ధిపూర్వకముగా పాపములోనే జీవించినయెడల, అతని హృదయము కఠినమై నిర్లక్ష్య స్వభావము వచ్చును. కనుక దేవుని యొద్ద నుండి క్షమాపణ కోరుకొనవలయునని కూడా అనుకొనడు. తాత్కాలికముగా నుండు ఆనందము నిచ్చు పాపము అనుభవించుటకే యిష్టపడునుగాని, నిత్యత్వము నరకమందు గడుపవలెనన్న విషయమును మరచిపోవుచున్నాడు.

    ఈ దినము నీ పరిస్థితి అట్లేయున్న యెడల, ఓ స్నేహితుడా, ఆలస్యము కాకమునుపే మేలుకో. ప్రేమగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను క్షమించి, ఆయనతో కూడా నిత్యత్వములో నీవు పాలుపొందునట్లు నిన్ను తన స్వంత బిడ్డగా చేసికొనును.
"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?"(మార్కు 8:36).


పరిచయ వ్యాసాలు

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు